18న సీఎంసీ మెడికల్ కాలేజ్ ఫైనల్… చర్చకు సిద్ధం అయిన సీఎస్ఐ పెద్దలు… ఢిల్లీ చేరిన ఫిర్యాదు… నిజామాబాద్ డాక్టర్లకు నగుబాటు కదా… కుట్ర చేసిన డాక్టర్ల భాగోతం బయట పెట్టనున్న “వార్తటుడే”

18న సీఎంసీ మెడికల్ కాలేజ్ ఫైనల్…

చర్చకు సిద్ధం అయిన సీఎస్ఐ పెద్దలు…

ఢిల్లీ చేరిన ఫిర్యాదు…

నిజామాబాద్ డాక్టర్లకు నగుబాటు కదా…

కుట్ర చేసిన డాక్టర్ల భాగోతం బయట పెట్టనున్న “వార్తటుడే”

(నిజామాబాద్ బ్యూరో – వార్తటుడే)

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కాలేజ్ వ్యవహారం కొలిక్కి వచ్చేందుకు రంగం సిద్ధం అయింది. ఈనెల 18న లేదా 19న ఫైనల్ చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే శనివారం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. మెదక్ డయాసిస్ బిషప్ లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలుస్తుంది. మరోవైపు షణ్ముఖ మహాలింగం సైతం ఢిల్లీలోని వైద్య శాఖ పెద్దలకు ఫిర్యాదు చేసి నిజామాబాద్ తిరిగి వచ్చారు.

అసలేం జరిగింది.?

సీఎంసీ మెడికల్ కాలేజ్ గత 18 ఏళ్లుగా మూత పడి ఉన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కొందరు ఎన్ఆర్ఐలు సీఎస్ఐతో కలిసి సీఎంసీని ప్రారంభించే ప్రయత్నాలు చేయాలి. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ)కు సీఎస్ఐలోని కొందరు తప్పుడు ఫిర్యాదులు చేసారు. దీనితో అంతర్గత విభేదాలతో ఏం జరిగిందో గాని కాలేజ్ ప్రారంభం చేయకుండానే వెళ్లిపోయారు. కానీ ఇటీవల తమిళనాడుకు చెందిన షణ్ముఖ మహాలింగం కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీస్ క్యాడర్ లో పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన 2024 అక్టోబర్ లో సీఎంసీ మెడికల్ కాలేజ్ ను సీఎస్ఐ నుంచి 36 సంవత్సరాలకు లీజు తీసుకున్నారు. సంవత్సరానికి రూ.3 కోట్లకు పైగా లీజ్ చెల్లించాల్సి ఉంది. ఈ ఒప్పందం ప్రకారం షణ్ముఖ మహాలింగం కంపెనీ అయిన ఇంటిగ్రెటెడ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ ప్రయివేట్ లిమిటెడ్ (ఐఎంఎస్ఆర్)తో సీఎస్ఐ అండ్ సీఎస్ఐ మెడికల్ బోర్డు ఒప్పందంతో సీఎంసీలో పనులు మొదలు అయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఇంత వరకు బాగానే ఉన్న సీఎంసీ మెడికల్ కాలేజ్ ప్రారంభం కోసం ముందుగా ఆసుపత్రి ప్రారంభించాల్సి వచ్చింది. ఇందు కోసం నిజామాబాద్ జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)ను కలిసారు. ఆలా మొదట ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్ సీఎంసీలో అడుగు పెట్టారు. వీరితో పాటు డాక్టర్ వినీలేష్, డాక్టర్ సుమంత్ మంత్రి, డాక్టర్ సుమన్ కుమార్ తో పాటు మరికొంత మంది సీఎంసీ ఆసుపత్రిలోకి చేరారు. ఆయా స్థాయిలో పనిలో చేరారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలు అయింది. తమిళనాడు నుంచి వచ్చిన ఒకేఒక్కడు షణ్ముఖ మహాలింగం ఉండటంతో సీఎంసీపై కొందరు నిజామాబాద్ కు చెందిన డాక్టర్ల కన్ను పడింది. ఇంకేం ఉంది ఇక్కడే కుట్ర మొదలు అయింది.

వివాదానికి పునాది…

ఒకే ఒక్కడుగా వచ్చిన షణ్ముఖ మహాలింగం అనారోగ్యానికి గురి కావడంతో కొత్త కుట్ర రచన మొదలు అయింది. అయితే డాక్టర్ గా చేరిన అజ్జ శ్రీనివాస్ సీఎంసీలో డైరెక్టర్ అయ్యేందుకు ముందుకు వచ్చారు. అందుకోసం చైర్మన్ షణ్ముఖ మహాలింగం, అజ్జ శ్రీనివాస్ మధ్య పెట్టుబడి ఒప్పందం కుదిరింది. అందుకు గాను ఐఎంఎస్ఆర్ పేరుతో అజ్జ రూ.5 కోట్లకు మూడు చెక్కులు ఇచ్చారు. అది కూడా తేదీలతో సహా చెల్లించేందుకు ఒప్పందం చేసి చెక్కులు ఇచ్చారు. దీనితో అజ్జ శ్రీనివాస్ ను చైర్మన్ హోదాలో షణ్ముఖ మహాలింగం డైరెక్టర్ గా నియమించారు. ఆ తర్వాత అనారోగ్యంతో షణ్ముఖ మహాలింగం చికిత్స నిమిత్తం బయటకు వెళ్లారు. డైరెక్టర్ హోదాలో ఉన్న అజ్జ శ్రీనివాస్ మరో డైరెక్టర్ వినీలేష్ పేరుతో నియామకాల కోసం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ విషయం బయటకు రావడంతో సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ కె. దయానంద్ ఒక నోటీసు విడుదల చేసారు. ఈ ప్రకటనకు సీఎంసీకి, సీఎస్ఐ సంబంధం లేదని ప్రకటించారు. మరోవైపు చైర్మన్ షణ్ముఖ మహాలింగం సైతం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని వ్యతిరేకంచారు. బోర్డు, చైర్మన్ అనుమతి లేకుండా ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉంటే అదే ప్రకటనను అడ్డం పెట్టుకొని వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని, టెక్నీకల్ సిబ్బంది, ఫోర్త్ క్లాస్ సిబ్బంది ఇలా 110 మందిని నియమించారు. ఈ నియామకాలకు చైర్మన్ నుంచి లేదా బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేదు. కానీ అక్కడ కనీసం రోజుకు పది మంది రోగులు కూడా రాకపోవడం విశేషం. ఇదంతా ఏప్రిల్, జూన్ నెలలో జరిగింది. ఈ నియామకాలపై మొదటి నుంచి వివాదం ఉంది. కొందరు వైద్యుల అర్హత పత్రాలపై సైతం చెల్లవనే (అనర్హులుగా) ఉన్నట్లు సమాచారం.

చైర్మన్ పై కేసు…

సీఎంసీ మెడికల్ కాలేజ్ ప్రారంభం చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన షణ్ముఖ మహాలింగం పై డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే అనారోగ్యంతో వెళ్లిన చైర్మన్ తిరిగి సీఎంసీకి వచ్చారు. కానీ అప్పటికే రెండు నెలలు అయ్యాయని, చైర్మన్ వేతనాలు ఇవ్వకుండా వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. 110 మంది వేతనాలు ఇవ్వాలని గోల చేసారు. మీ అర్హత పత్రాలు, దరఖాస్తులు ఇస్తేనే వేతనాలు ఇస్తానని చెప్పడంతో గొడవ చేసారు. అర్హతకు మించి వేతనాలు రాసారని, నెలకి రూ. 25 లక్షలకు పైగా ఇవ్వాల్సి వస్తుందని లెక్కలు బయట పడ్డాయి. ఇలా *ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం* అన్నట్లు అయింది. నలుగురు రోగులు లేని ఆసుపత్రి లో రూ.25 లక్షలు వేతనాలు ఏమిటీ అనే ప్రశ్న తలేతింది. గొడవ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కించారు. ఈ వ్యవహారం వెనుక షణ్ముఖ మహాలింగంను ఇక్కడి నుంచి పంపించే కుట్ర జరిగిందనే ప్రధాన ఆరోపణ. చైర్మన్ రావడంతోనే సీఎంసీ సిబ్బంది అంతా ఒకేసారి ఛైర్మెన్ పై దాడి చేసే ప్రయత్నం చేసారు. చైర్మన్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. వచ్చిన పోలీసులు చైర్మన్ ను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లి తిరిగి ఇంటికి పంపించారు. అయితే అజ్జ శ్రీనివాస్ ఆయన బృందం ఇబ్బంది పెడుతున్నారని, నాపై హత్య చేసే ప్రయత్నం చేసారని జూలై 5, అలాగే 8న డిచిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. కానీ అజ్జ శ్రీనివాస్ జులై 13న డిచ్ పల్లి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో చైర్మన్ పై కేసు నమోదు చేసారు. అయితే పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతుంది.

 

తప్పుడు ప్రచారం…

అసలు ఏం జరుగుతుంది.? ఏమైంది.? అనే ప్రశ్నలు జిల్లాలో మొదలు అయ్యాయి. కానీ ఇక్కడ సీఎస్ఐలోని మెడికల్ బోర్డు కన్వీనర్ ఆడిన డ్రామాతో అంతుపొంతు లేని వివాదం మొదలు అయింది. 2024లో అగ్రిమెంట్ చేసుకొని సీఎంసీ చైర్మన్ గా షణ్ముఖ మహాలింగం దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేసి ఏంసీఐ హైపవర్ కమిటీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసే వరకు వచ్చింది. కానీ జూలై 30, 2025న సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ ఇచ్చిన ఒక ఆపాయింట్మెంట్ అంటే గౌరవ డైరెక్టర్ గా అజ్జ శ్రీనివాస్ ను నియమించారు. అయితే ఇందులో సీఎంసీలో హక్కులు ఎవరికీ ఉంటాయి. డ్రామా ఎవరు చేస్తున్నారు. ముందుగా చైర్మన్ షణ్ముఖ మహాలింగం డైరెక్టర్ గా అజ్జ శ్రీనివాస్ ను నియమించారు. అక్రమ నియమాకాలు చేయడంతో రెండు నెలలకే తొలగించారు. కానీ అనూహ్యంగా సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ వచ్చి అజ్జ శ్రీనివాస్ ను గౌరవ డైరెక్టర్ గా నియమించడం వెనుక అంతర్యం ఏమిటో అర్ధం చేసుకోవాలి. ఈ వ్యవహారంలో లక్ష రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతుంది. మరో పక్క షణ్ముఖ మహాలింగం స్థానికంగా లేని సమయం చూసి నకిలీ ఐఏఎస్ అని, చైర్మన్ పై పోలీసు కేసులు ఉన్నాయని, రూ. 2.20 కోట్లతో చైర్మన్ పరారి అయ్యాడని తప్పుడు ప్రచారం చేస్తూ అటు పోలీసులను జిల్లాలో ప్రజలను నమ్మించాలనే ప్రయత్నాలు చేసారు. దీనికి తోడు పోలీసులను తప్పుతోవ పట్టించి కేసు నమోదు చేయించి మరింత బలంగా నమ్మించే ప్రయత్నం చేసారు. కానీ షణ్ముఖ మహాలింగం నిజామాబాద్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో అసలు భాగోతం బయట పడింది.

మన డాక్టర్లకు నగుబాటు కదా…

నిజామాబాద్ జిల్లా డాక్టర్లకే నగుబాటు అయ్యేలా మారింది సీఎంసీ మెడికల్ కాలేజ్ వ్యవహారం. ఐఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అవుతున్న సీఎంసీ మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారనే అపచారాన్ని మూట కట్టుకుంటున్నారు. “వార్తటుడే”కు అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐఎంఏ పేరుతో సీఎంసీలోకి అడుగు పెట్టి సీఎంసీ ప్రారంభం కాకుండా చూస్తున్నారు. సీఎంసీ మొదలు అయితే జిల్లా కేంద్రంలో ఇబ్బందులు ఏర్పడుతాయని కొందరు డాక్టర్లు కుట్ర చేసారు. అందుకోసం పక్క ప్రణాళికతో అడుగులు వేసారు. ఒక్కడే వచ్చి మెడికల్ కాలేజ్ ప్రారంభం చేయడంతో మొదటి నుంచే ఆయనపై కుట్ర జరిగింది. వచ్చిన వ్యక్తేనే వచ్చినట్టు వెనక్కి పంపాలని ప్లాన్ చేసారు. అందుకోసం కొందరు డాక్టర్లు పెట్టుబడుల పేరుతో సీఎంసీలోకి వెళ్లి డైరెక్టర్లు గా మారారు. అనుకున్నట్లుగానే అనుమతులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. తప్పుడు ప్రచారంతో చైర్మన్ ను బయటకు పంపించే ప్రయత్నాలు జరిగాయి. జిల్లా అభివృద్ధిలో కీలకమైన మైలురాయిలాంటి మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెళువెత్తుతున్నాయి. నిజామాబాద్ కు చెందిన డాక్టర్ల కుట్ర వల్లనే సీఎంసీ మెడికల్ కాలేజ్ వివాదం జరిగిందని బహిరంగ ప్రచారం జరుగుతుంది. జిల్లాలో లెక్కకు మించిన ఫీజులు, ఇష్టారాజ్యాం గా బిల్లులు వేయడం, ప్రజలను పట్టి పిడిస్తున్నరనే అపవాదు ఉంది. సీఎంసీతో ఈ పరిస్థితి ఉండదనే ముందుగానే కుట్ర చేసినట్లు సమాచారం. అందుకే ఆరుగురు డాక్టర్లు ముందుగా వెళ్లి ప్లాన్ ప్రకారం కుట్ర చేసారనేది రూడి అవుతుంది. ఇందుకు ముందు పోలీసులను తప్పుతోవ పట్టించి అనుకున్నట్లుగా ప్రచారం చేసి కొత్త నాటకానికి తెర తీశారు. మొత్తానికి మెడికల్ కాలేజ్ ప్రారంభం కాకుండా మోకాలు అడ్డారు. ఇంతకు ఈ కుట్ర చేసిన డాక్టర్లు ఎవరు.? వారి బాగోతాలు ఏమిటీ.? పూర్తి వివరాలు ఆధారాలతో “వార్తటుడే” వరుసగా మీ ముందు ఉంచుతుంది.

Leave A Reply

Your email address will not be published.