“జాగృతి” జాగ్రత్తయేనా…? జాగృతి కోసం కవిత వర్సెస్ కేటీఆర్… రాజీవ్ ఓ వర్గంతో బయటకు… జాగృతియా.? రాజకీయ పార్టీనా.?… కవిత ప్రకటన కోసం ఎదురు చూపులు…
“జాగృతి” జాగ్రత్తయేనా…?
జాగృతి కోసం కవిత వర్సెస్ కేటీఆర్…
రాజీవ్ ఓ వర్గంతో బయటకు…
జాగృతియా.? రాజకీయ పార్టీనా.?…
కవిత ప్రకటన కోసం ఎదురు చూపులు…
హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 6 :
జాగృతి అంటే కవిత, కవిత అంటే జాగృతి… పార్టీ కంటే జాగృతి కోసం కల్వకుంట్ల కవిత ప్రాణం పెట్టి పని చేసారు. తెలంగాణ సంప్రదాయం పండుగ అయినా బతుకమ్మ సంబరాలు జాగృతి పేరుతో కవిత ప్రపంచం అంతా నిర్వహించారు. ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు జాగృతి ని రెండు ముక్కలు చేసి లాక్కునే కుట్రలు జరిగినట్లు కనిపిస్తుంది. కవితకు నమ్మినబంటుగా పేరున్న రాజీవ్ సాగర్ కేటీఆర్ పంచన చేరి జాగృతిలో గ్రూపు రాజకీయం చేయడం విశేషం. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి జాగృతి తమదేనని చెప్పడం గమనార్హం.

జాగృతి చీలిక వెనక కేటీఆర్ హస్తం…
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన తోడబుట్టిన చెల్లి కవిత పట్ల మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె నుంచి లాగేసుకునే యత్నాలకు కేటీఆర్ పదును పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే తొలి అడుగు కూడా పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాగృతి సంస్థ ఏర్పాటు సమయంలో కవితతో పాటు కీలకంగా పని చేసిన పలువురు నేతలను కేటీఆర్ రంగంలోకి దించారు. కేటీఆర్ రంగంలోకి దింపిన నేతల్లో రాజీవ్ సాగర్, రాజారాం యాదవ్, మఠం బిక్షపతి తదితరులు గురువారం ఏకంగా హైదరాబాద్ లో మీడియా సమావేశాన్నే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు కవిత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తమను నడిరోడ్డుపై పడేసిందని రాజీవ్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎవరిని అడిగి ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కూడా ఆయన ప్రశ్నించారు. జాగృతి ఆవిర్భావంలో కవితతో కలిసి సాగామని, సంస్థలో కవితకు ఎంత పాత్ర ఉందో తమకూ అంతే పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలే తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. ఈ తాతంగం వెనుక కేటీఆర్ ఉండి నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఎంపీగా ఓటమి వెనక ఎమ్మెల్యేలు…
నిజామాబాద్ పార్లమెంట్ 2018 ఎన్నికల్లో కవిత ఓటమి వెనుక కేటీఆర్ ఉండటంతోనే అప్పటి ఎమ్మెల్యేలు కారణం అనేది అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటి వ్యవహారం వెనుక కేటీఆర్ అన్నాడనే ప్రచారం నిజమే అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు అందరు గెలిచిన ఎంపీగా కవిత ఓటమి వెనుక సవలక్ష కారణాలు ఉన్నప్పటికీ పార్టీ నుంచి కవితను బహిష్కరణ చేయడంతో ఒకొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. కీలకంగా నమ్మకంగా ఉన్న నాయకులు కొందరు కవితపై తిరుగుబాటు చేసి కేటీఆర్ వెంట వెళ్లడంతో జాగృతి మనుగడపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు పార్టీ నుంచి బహిష్కరణకు గురి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత మౌనం వహిస్తున్నారు. ఈ మౌనం వెనక ఏం ఉందో కానీ మళ్ళీ కవిత జాగృతినే నడుపుతారా.? లేక కొత్త రాజకీయ పార్టీ పెడతారా.? అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే జాగృతి నాయకులు సైతం మౌనం పాటించడం గమనార్హం. ఏది ఏమైనా ఈనెల 17న తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం మరి.