ఉసురు తీస్తున్న ఉమ్మెడ బ్రిడ్జి… గోదావరి నదికి అడ్డుకట్ట వేసి బ్రిడ్జి నిర్మాణం… 2054 మీటర్ల రోడ్డులో 1294 మీటర్ల మట్టికట్ట… నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం…
ఉసురు తీస్తున్న ఉమ్మెడ బ్రిడ్జి…
గోదావరి నదికి అడ్డుకట్ట వేసి బ్రిడ్జి నిర్మాణం…
2054 మీటర్ల రోడ్డులో 1294 మీటర్ల మట్టికట్ట…
నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం…
(నెట్ వర్క్ – వార్తటుడే – తెలంగాణ )
అది నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ, నిర్మల్ జిల్లా పంచగుడి గ్రామాలను కలుపుతూ రెండు కిలోమీటర్ల పొడవున నిర్మించిన బ్రిడ్జి. ఈ బ్రిడ్జితో రెండు జిల్లాల ప్రజలకు రాకపోకలు సులువు అవడంతో సంతోషం వ్యక్తం చేసారు. 2023 లో ప్రారంభం అయిన ఈ బ్రిడ్జితో 2025లో వచ్చిన భారీ వర్షాలు వరదల కారణంగా నాలుగు నియోజకవర్గాల ప్రజల తీవ్ర ఇబ్బందులకు పడాల్సి వచ్చింది. సుమారు 42కు పైగా గ్రామాలు నీట మునిగాయి. లక్ష ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది. ఊహించని ఈ పరిణామాలు ఎప్పుడు లేని విధంగా నెలరోజుల వ్యవధిలో బాసర సరస్వతి ఆలయం మెట్లను వరద నీరు తాకాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో భారీ వర్షాలు రావడంతో వరదలు పెరిగి ముంపు విస్తీర్ణం రెండింతలు అయింది. చివరకు చూస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ప్రమాద స్థాయి నీరు కూడా లేదు. ఇన్ ప్లో ఎప్పటిలాగే ఉన్నప్పటికీ ముంపు తగ్గకపోవడంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. భారీగా పంట నష్టం జరిగి ఎప్పుడూ లేని స్థాయిలో ముంపు పెరగడంతో అది కూడా రోజుల తరబడి ముంపు నీరు తగ్గకపోవడంతో భిన్నభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 45 ఎకరాల పంట నష్టం జరగడంతో రిటైర్డ్ పోలీస్ అధికారి (మాజీ డిఎస్పి) రైతు, న్యాయవాది మనోహర్ వరద ముంపు కారణాలతో తెలుసుకునే ప్రయత్నం చేశారు. గతంలో మూడున్నర సంవత్సరాల పాటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ముందుకు అడుగు వేశారు. కందకుర్తి బ్రిడ్జి అంటే హరిదా, మంజీరా, గోదావరి మూడు నదుల సంగమం నుంచి పరిశీలన మొదలుపెట్టారు. అలా చివరకు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మేడ వద్ద నిర్మించిన రెండు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని పరిశీలించారు. అప్పటికి గాని అసలు విషయం బోధపడలేదు. సరిగ్గా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి 29.89 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మెడ బ్రిడ్జి గుట్టు బయటపడింది. ఈ లోగుట్టు కారణంగానే వరద ముంపు పెరిగి ఎక్కువ సంఖ్యలో గ్రామాలు ముంపు నీరు రావడం మొదలైంది. ఆయకట్టుకు కూడా ఎక్కువగా ముంపునకు గురైందని గుర్తించారు. ఈ విషయమై నిజామాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలోని బాధ్యత రైతులతో ఇటీవల నవీపేట్ మండల కేంద్రంలో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతులు వాస్తవ పరిస్థితులను సైతం గుర్తించి ఉమ్మడి బ్రిడ్జి విషయం గుట్టు బయట పెట్టారు.

*ఇది బ్రిడ్జ్ లోగుట్టు…*
గోదావరిపై నదిపై నిర్మించిన బ్రిడ్జి లోగుట్టు అక్కడికి వెళ్లి పరిశీలిస్తే గాని అంతుపట్టదు. రెండు కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం బ్రిడ్జి 2054 మీటర్ల పొడవు ఉండగా ఇందులో 760 మీటర్లు మాత్రమే పిల్లర్లు వేసి బ్రిడ్జి నిర్మించారు. మిగిలిన 1294.16 మీటర్ల పొడవున నదికి అడ్డంగా మట్టికట్ట వేసి దానిపై రోడ్డు వేశారు. ఉమ్మెడ నుంచి పంచగుడి వెళ్తుండగా వాస్తవ సరిహద్దు నుంచి 235.29 మీటర్లు మట్టి కట్ట వేసి రోడ్డు వేశారు. 79.75 మీటర్ల సిమెంట్ పిల్లర్లతో బ్రిడ్జి వేశారు. అక్కడ నుంచి 139.49 మీటర్లు కూడా నదికి అడ్డంగా మట్టికట్ట వేశారు. ఇంకా నది మధ్యలో మాత్రం 520.25 మీటర్ల పొడవున పిల్లర్లతో బ్రిడ్జి నిర్మించారు. మళ్లీ 179.38 మీటర్ల మట్టి వేసి నది నీరు రాకపోకలను అడ్డం పెట్టారు. ఆ తర్వాత 160 మీటర్ల పొడవును పిల్లర్ల బ్రిడ్జి నిర్మించారు. అక్కడి నుంచి పంచగుడి సరిహద్దు వరకు 740 మీటర్ల పొడవునా మట్టికట్ట వేసి రోడ్డు వేశారు. బ్రిడ్జి పైనుంచి అటు ఇటు వెలుతుంటే నది ప్రాంతం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ రోడ్డు కింద నదికి అడ్డంగా ఉన్న 1294.16 మీటర్ల మట్టి కట్ట ఎవరికీ కనిపించదు. ఈ మట్టి కట్టడం వల్లనే గోదావరి నది ద్వారా వస్తున్నా వరద నీరు సరాసరి ప్రాజెక్తులోకి వెళ్లడం లేదు. ఈ కట్టతో నీరు వెనక్కి తన్నుకొని నాలుగు నియోజక వర్గాల గ్రామాలను ముంపునకు గురి చేస్తుంది. ఈసారి 42 కుపైగా గ్రామాలకు ముంపు రావడం, లక్షకు పైగా ఎకరాలు పంట నష్టం జరిగింది. ఇది అసలు కథ. అయితే నీటి పారుదల అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు.

తప్పేవరిది..?
2023 లో బిఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన ఉమ్మెడ పంచగుడి బ్రిడ్జి నిర్మాణంలో తప్పు ఎవరిదీ అనేది ప్రశ్నర్ధకంగా మారింది. నదులపై నిర్మించే బ్రిడ్జిలపై. భారీ నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. నిర్మాణం చేసేది ఏ శాఖ అయిన పర్యవేక్షణ చేయాల్సింది నీటి పారుదల శాఖదే. కానీ ఇంత పెద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎందుకు చూసి చూడనట్లు వ్యవహారించారు. పరిశీలించాల్సిన ఆర్ అండ్ బి అధికారుల కళ్ళకు ఈ తాతంగం కనిపించలేదా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిల పాపం తల పిడి కేడు అన్నట్లుగా అందరు అధికారులు కలిసి వరద ముంపు గ్రామాల ప్రజలను పంటలను ముంచుతున్నారు. ఇప్పుడు అసలు విషయం బయటకి రావడంతో విమర్శలు వెళువెత్తుతున్నాయి.

నిర్లక్ష్యమేలా…
ఎక్కడ ఏ చిన్న వరద ముంపు ఏర్పడిన విపత్తు జరిగిన స్పందించాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం ఈ బ్రిడ్జి, పైన ముంపు గురించి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. ఎందుకంటే 1986లో 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిన ఇప్పుడు జరిగినంత నష్టం జరగలేదు. కానీ 5.50 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఈసారి భారీ నష్టం జరిగింది. ముంపు కూడా పెరిగింది. ఇవేవి టకు పట్టనట్లుగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, దించడానికే పరిమితం అవుతున్నారు. ఇక్కడ ఒక్కటీ గమనించాలి. ఎస్ఆర్ఎస్పిలో 80 టిఎంసిలు నీరు ఉన్నప్పుడు ఇన్ ప్లో 5 లక్షలకు పైగా వస్తే 39 గేట్లు ఎత్తి అవుట్ ప్లో 5.50లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి డ్యామ్ లో 70 టిఎంసిల నీరు ఉంటే పైనుంచి 2.30 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే డ్యామ్ ఎందుకు నిండటం లేదు. డ్యామ్ నిండటంలో జాప్యం ఎందుకు జరుగుతుంది. దీనిపై పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వదిలేసి వరద క్యూసెక్కుల లెక్కల ప్రకారం నీటిని కిందకు వదులుతున్నమని చెపుతున్నారు. గతంలో 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చిన జరగనంత ముంపు నష్టం ఈ 5 లక్షల క్యూసెక్కుల నీటితోనే ఎందుకు ముంపు పెరిగింది. దీనికి కారణం ఏమిటి అనేది గాలికి వదిలేసారు. ఇది నీటి పారుదల శాఖ పని తీరు.

బ్రిడ్జి నిర్మాణంపై విచారణ చేయలి…
బి. మనోహర్, న్యాయవాది, రైతు…
గోదావరి నదీపై ఉమ్మెడ వద్ద నిర్మించిన బ్రిడ్జి నిర్మాణంపై హై కోర్టు రిటైర్డ్ జడ్జితో లేదా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ తో విచారణ చేసి చర్యలు చేపట్టాలి. గోదావరి వదదముంపు తగ్గించాలి. ఏందుకంటే నదిపై నిర్మించిన బ్రిడ్జి మద్య మధ్యలో నదికి అడ్డంగా మట్టి కట్ట వేసి దానిపై రోడ్డు వేసారు. దానివల్ల ఎస్ ఆర్ ఎస్ పి డ్యాములోకి నీరు సరాసరి వెళ్ల కుండా అడ్డం పడుతుంది. దింతో నీరు ఒత్తిడి తో వెనక్కి ముంపు పెరుగుతుంది. దీని వల్లనే గ్రామాలలోకి వరద నీరు వస్తుంది. ఈసారి పంట నష్టం కూడా తీవ్రంగా పెరిగింది. అందుకే బాసర బ్రిడ్జి తరహాలో ఉమ్మెడ బ్రిడ్జిని ఎత్తు పెంచి పునర్మించాలి. మధ్య మధ్యలో ఉన్న మట్టి కట్టాలను తొలగించి బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నాం. బ్రిడ్జి పునః నిర్మాణం చేసే వరకు ఆందోళన చేస్తాం.