*”గెలుపు – ఓటమి”* ఆదివారం ఓ కథ…

*…గెలుపు- ఓటమి…*
*****——*****—-***

ఆకాశంలో ముసురు పట్టింది. ఇప్పుడో ఇంకాసేపటికో పెద్ద వాన పడేట్లుగా ఉంది.

“వానొచ్చేట్లుగా ఉంది.ఇంక వాడిని తీసికొని ఇంటికి వచ్చేయండి!” అని భర్త ప్రకాశానికి ఫోన్ చేసింది శ్రీదేవి.
ఏడేళ్ల మనవడు చేతనును తీసికొని ఇంటికి వచ్చాడు ప్రకాశం.
గార్డెనులో ఫ్రెండ్సుతో ఆడుకుంటూ ఆ కాసేపు అమ్మమను మర్చిపోయిన చేతన్ ఇంటికి రాంగానే అమ్మమ్మ కోసం ఏడవటం మొదలు పెట్టాడు. వాడిని సముదాయించి, అన్నం పెట్టేసరికి తలప్రాణం తోకకు వచ్చింది భార్యాభర్తలిద్దరికీ.

అసలు జరిగిన కథలోకి వెళ్తే..

చేతన్ పుట్టిన సంవత్సరానికి శౌరి భార్య వినీల ఆఫీసు నుంచి స్కూటీ మీద ఇంటికి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయింది.

అంతదాకా’ ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసాము.వాళ్లు హాయిగా ఉన్నారని’ కంచికచర్లలో కాలక్షేపం చేస్తున్న ప్రకాశం దంపతులకు ఇది చాలా పెద్ద దెబ్బ.అటు వినీల తల్లిదండ్రులు కూడా కూతురి మరణాన్ని తట్టుకోలేక పోయారు. వినీల తండ్రి సుధాకర్ ఎలాగోలా తిరుగుతున్నా తల్లి హైమ మాత్రం అంత తొందరగా కోలుకోలేకపోయింది. కూతురు పోయినప్పటి నుండి హైమకు మనవడు చేతనంటే ప్రాణం. అందుకని సుధాకర్ దంపతులు అల్లుడి దగ్గరే ఉంటున్నారు. ఎప్పుడో తప్ప వాళ్ళ కొడుకు అభిరామ్ దగ్గరికి వెళ్ళటం లేదు. మనవడిలో తన కూతుర్ని చూసుకుంటూ తృప్తి పడుతోంది హైమ. అప్పుడప్పుడు శ్రీదేవి, ప్రకాశం వచ్చి కొడుకు దగ్గరికి ఉండేవాళ్లు.అయితే హైమా వాళ్ళు ఉండడం వల్ల వాళ్లకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఈ మధ్య ప్రకాశానికి ఒంట్లో బాగుండటం లేదు. కొడుకు దగ్గర ఉండి వైద్యం చేయించుకోవాలని ఆశ.కానీ కొడుకు దగ్గరికి వచ్చి ఉండటానికి వీలు లేదు. శౌరి ఇంట్లో హైమ పెత్తనం ఎక్కువ. పోనీ భార్య పోయిన కొడుకుకు మళ్ళీ పెళ్లి చేస్తే బాగుంటుందనుకున్నారు ప్రకాశం దంపతులు.

శౌరికి కూడా ఈమధ్య తనకొక తోడు ఉంటే బాగుండనిపిస్తోంది.ఒంటరి జీవితం విసుగనిపిస్తుంది. అయితే అల్లుడు రెండో పెళ్లికి సిద్ధపడటం హైమకు చాలా బాధగా ఉంది.నాలుగేళ్లు కాపురం చేసిన తన కూతుర్ని మర్చిపోయి రెండో పెళ్లి చేసుకుంటానంటే చూస్తూ కూర్చోలేకపోతోంది హైమ. అప్పటికీ హైమ కొడుకు అభిరామ్ కూడా తల్లికి నచ్చ చెప్పాలని చూశాడు.

“అమ్మా!ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది. బావగారు ఇంకో పెళ్ళి చేసుకుంటే నష్టం ఏమిటి? మీరిద్దరూ పెద్ద వాళ్లయ్యారు.పసి పిల్లవాడిని పెంచటం ఈ వయసులో సాధ్యం అవుతుందా? మన ఇంటికి పోదాము!”
కొడుకు మాటకు ససేమిరా అంది హైమ.

“ఇప్పుడు ఆడపిల్లలే మళ్ళీ పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు..అతడు మగవాడు…లక్షణంగా ఉన్నాడు. చక్కని ఉద్యోగం.. పోనీ వేరే అమ్మాయిని తెస్తే మాత్రం ఏమైంది?వాళ్ల సంసారం వాళ్లు చూసుకుంటారు.ఎంతకాలం మనం ఈ చిన్న పిల్లవాడిని పెంచగలం? మనం మన ఇంటికి వెళ్దాం! కాస్త మనసు సర్దుకో హైమా!” అంటూ సుధాకర్ నచ్చచెప్తున్నా చేస్తున్నా హైమ వినటం లేదు. హైమకు అల్లుడు మీద కోపం తగ్గటం లేదు.

దీనికి తోడు రెండు రోజుల క్రితం కంచికచర్ల నుండి ప్రకాశం దంపతులు వచ్చారు. వాళ్లు రాంగానే హైదరాబాదులో ఉండే శౌరి మేనమామ రామకృష్ణ రెండు సంబంధాల గురించిన వివరాలు తీసికొని వచ్చాడు. ఇంట్లో పెళ్ళిగురించి చర్చలు జరుగుతున్నాయి.తెచ్చిన సంబంధాల్లో ఒకటి అందరికీ నచ్చింది. జాతకాలు కుదిరాయని, పిల్ల బాగుందని మాట్లాడుకొంటుంటే హైమకు గుండె మండిపోతోంది.
సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు శౌరి. అతడిని చూడంగానే అప్పటి దాకా హైమలో అణిచిపెట్టుకున్న ఆవేశం ఒక్కసారిగా బయటికి పొంగింది.

“మీకు ఎవ్వరికీ నా కూతురు గుర్తుకు రావడం లేదు కదూ!దాన్ని చావు నాకు ఇంకా గుర్తుంది..మీరు మాత్రం నా బిడ్డను మర్చిపోయి టింగురంగా అంటూ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారేమో..దాని ఉసురు కొట్టి తీరుతుంది! కళకళలాడుతూ తిరగాల్సిన పిల్ల…వెళ్ళిపోయింది!.. ఇంకేం!మీరు లక్షణంగా వేరే పెళ్లి చేసుకోండి! నా మనవడు మీ సరదాలకు, తిరుగుళ్ళకూ అడ్డంగా ఇక్కడ ఎందుకు? వాడిని తీసికొని నేను నా ఇంటికి వెళ్ళిపోతాను! మీరు మాత్రం కొత్త పెళ్ళాంతో ఊరేగుదురు గానీ! ఇంక మాతో మీకేమీ సంబంధం లేదు నాయనా!” అంటూ వలపలా ఏడ్చింది హైమ.

ఈ హఠాత్పరిణామానికి నిర్ఘాంత పోయారందరూ.
అక్కడే ఆడుకుంటున్న చేతన్ బిక్క మొహం వేసుకొని అమ్మమ్మని చూస్తున్నాడు.చటుక్కున లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు శౌరి.
వెంటనే తేరుకున్న సుధాకర్ ప్రకాశం చేతులు పట్టుకున్నాడు.

“క్షమించండి బావగారూ!కన్నతల్లి… సమాధాన పడలేకపోతోంది!.. కొన్ని రోజులకు సర్దుకుంటుంది. ఇక్కడే ఉంటే హైమ వల్ల మీకు ఇబ్బంది. మేము మా ఇంటికి వెళ్తాము! అన్నీ మెల్లగా చక్కబడతాయి!”అంటూ అప్పటికప్పుడు భార్యను తీసికొని వెళ్ళటానికి తయారయ్యాడు సుధాకర్.
చేతనును పట్టుకొని భోరుమంది హైమ.

“జాగ్రత్తగా ఉండు నాన్నా!నీ కింక ముద్దు ముచ్చట్లేం జరుగుతాయి? నిన్ను వేయించుకు తినటానికి నీకో సవత్తల్లి వస్తుంది. దానికి పుట్టే పిల్లలకు చాకిరీ చేస్తూ బతకాల్సిందే!… నీతో..ఈ ఇంటితో నా ఋణం తీరిపోయింది..”అంటూ ఆక్రోశిస్తున్న భార్య చెయ్యి పట్టుకొని బరబరా లాక్కెళ్లాడు సుధాకర్.

“అమ్మా!బావగారు రెండోపెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? వాళ్లిద్దరు పిల్లవాడిని చూసుకుంటారు. మీరు మన ఇంట్లో ఉండకుండా అల్లుడి ఇంట్లో ఉండటం ఏం బాగుంటుంది? బావగారికి కూడా వాళ్ళ అమ్మానాన్నల్ని తన దగ్గర ఉంచుకోవాలని ఉంటుంది కదా!వాళ్ళ కొడుకు దగ్గర వాళ్ళు ఉండటం ధర్మం. పిల్లవాడు నాలుగు రోజులు ఏడ్చినా తర్వాత సర్దుకుంటాడు!మీరు ఇక్కడే ఉండండి!”తల్లికి కాస్త గట్టిగానే చెప్పాడు అభిరామ్.
హైమకు కొడుకు బోధ నచ్చలేదు.

జరిగిన దానికి బాధపడుతూ కూర్చున్నారు ప్రకాశం దంపతులు. వాళ్ళని ఓదారుస్తున్నాడు రామకృష్ణ. హఠాత్తుగా అమ్మమ్మ వెళ్లిపోవడంతో ఏడ్చిఏడ్చి పడుకున్నాడు చేతన్. బాబు పక్కన పడుకొని ఆలోచిస్తున్నాడు శౌరి.

‘ అత్తగారు ఏడ్చిందని కాదుకానీ తనకు తెలియని విషయాలు తెలియచెప్పింది. తను మరో పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది కానీ బాబుకు తల్లి అవుతుందా?అసలు తనేమి ఆలోచించాడు? కొత్త భార్య వస్తే కేవలం బాబును చూసుకోవడానికి మాత్రమేనా? ఆమెకు మాత్రం కోరికలుండవా? సొంత పిల్లలు కావాలని ఉండదా? అప్పుడు చేతన్ పరిస్థితి ఏంటి? అత్తగారు చెప్పింది చాలా వరకు నిజం!తన కొత్త భార్య బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుందని నమ్మకం ఏమిటి?”

ఆ రాత్రంతా నిద్ర పట్టలేదుశౌరికి.

అమ్మమ్మ కోసం రోజూ ఏడుస్తున్నాడు చేతన్. వాడిని పట్టుకోవటం కష్టంగా ఉంది శ్రీదేవికి. వాడికి బామ్మతో ఉండటం అస్సలు అలవాటు లేదు. ఊహ తెలిసిన దగ్గర్నుంచి వాడికి తెలిసింది అమ్మమ్మ ప్రేమ, లాలింపు…. ఇప్పుడు అమ్మమ్మ లేక పోతే ఆ పసిప్రాణం కొట్టుకులాడుతోంది. ఆఫీసుకు సెలవు పెట్టి చేతనును చూసుకుంటున్నాడు శౌరి. అలా కంచికచర్లకు వెళ్లకుండా కొడుకు దగ్గరే ఉండిపోయారు ప్రకాశం దంపతులు.ఒక వారం రోజులు కొడుకుతో ఆడుకుంటూ గడిపాడు శౌరి.

హైమ కొడుకు అభిరామ్ శౌరికి ఫోన్ చేశాడు. జరిగిన దానికి బాధ పడుతున్నానని, అమ్మవాళ్లను తన దగ్గరే ఉంచుకుంటానని, పెళ్ళి సంబంధం కుదుర్చుకోమని శౌరిని క్షమాపణ కోరాడు అభిరామ్.

ఆరోజు రాత్రి చేతన్ పక్కన కూర్చొని కథల పుస్తకం తీసి వాడి చేత చదివిస్తున్నాడు శౌరి.

” నాన్నా!సవత్తల్లి స్నో వైట్ లో విచ్ లాగా ఉంటుందా? ” చేతన్ ప్రశ్న విని ఆలోచనగా వాడివైపు చూశాడు శౌరి.

” నన్ను చంపేయమంటుందా? ” చేతన్ కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే బాబుని గట్టిగా దగ్గరికి తీసుకొని

” లేదు! లేదు!మన ఇంటికి సవత్తల్లి అస్సలు రానే రాదు! నీకేమీ భయం లేదు!”అంటూ ముద్దు పెట్టుకున్నాడు శౌరి.

” నిజంగా? ”

” నిఝంగా!”అంటూ వాడి తల మీద గట్టిగా చేయి పెట్టాడు శౌరి.

చేతనుకు సంతోషం వేసింది.

“ఉండు!అమ్మమ్మతో చెప్తాను! సవత్తల్లి మన ఇంటికి రాకపోతే అమ్మమ్మ వచ్చేస్తుంది!”అంటూ పక్కనున్న సెల్ ఫోన్ తీసుకొని హైమకు రింగ్ చేశాడు చేతన్.
మంచం మీద ఎగురుతూ, అమ్మమ్మతో సంతోషంగా మాట్లాడుతున్న కొడుకును చూసి ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు శౌరి.

ఆ ప్రక్కరోజే చేతనును తీసికొని అత్తగారింటికి వెళ్ళాడు శౌరి. అమ్మమ్మను కరుచుకుపోయాడు చేతన్. వాడిని గట్టిగా హత్తుకొని ముద్దులు పెట్టుకుంది హైమ.
కాసేపు అభిరాముతో, సుధాకరుతో క్షేమసమాచారాలు మాట్లాడి, మళ్ళీ పెళ్లి చేసుకొనే ఆలోచనను విరమించుకున్నానని చెప్పి చేతనును అక్కడే వదిలి వచ్చాడు శౌరి.

“చూశారా!.. చూశారా!…పిల్లవాడు ఎంత చిక్కిపోయాడో!ఆ శ్రీదేవికి వీడ్ని చూసుకోవటం తెలుస్తుందా అసలు?..అప్పుడప్పుడు వచ్చి మొహం చూసి పోయేవాళ్ళకి వీడికి ఇష్టమైనవేంటో, ఎలా తినిపించాలో ఎలా తెలుస్తుంది?నేను లేకపోతే క్షణం ఉండలేడమ్మా నా బిడ్డ!” అంటూ ఆ పూటంతా పిల్లవాడిని పట్టుకొని వాడిని నిమురుకుంటూ కూర్చుంది హైమ.వాడు కూడా అమ్మమ్మను వదలకుండా ఉన్నాడారోజంతా. ఏ దుష్టశక్తి వచ్చినా అమ్మమ్మ మాత్రమే తనని రక్షిస్తుందని ఆ పసివాడి భావన.

ఆ రాత్రికే అల్లుడింటికి వచ్చారు సుధాకర్ దంపతులు. భారమైన హృదయాలతో కంచికచర్లకు వెళ్లి పోయారు ప్రకాశం శ్రీదేవిలు.

మామూలు రొటీన్ మొదలయింది శౌరికి.

అయితే ఈసారి హైమ ఖాళీ దొరికినప్పుడుడల్లా మనవడిని దగ్గర పెట్టుకొని
దుష్టురాళ్లయిన సవతి తల్లుల కథలు చెప్పసాగింది.
ఆవిడ అనుకున్నట్లుగానే చేతనుకు సవతితల్లి అంటే ఒక భయంకరమైన రాక్షసి అనే భావన ఏర్పడింది.
హైమకు సంతోషంగా ఉంది. తప్పీ జారి శౌరి మళ్ళీ పెళ్లి చేసుకున్నా మనశ్శాంతిగా మాత్రం ఉండడు!చేతన్ సవతితల్లి నీడ కూడా భరించలేడు… వాడు తన దగ్గరికే వచ్చేస్తాడు…ఏ రకంగా చూసుకున్నా గెలుపు తనదే అవుతుంది. ఆ శ్రీదేవి కొడుకు దగ్గర వచ్చి ఉండటం కల్ల!

**** ***** ***** ***** **** ***** ***** *****

కాలం గడుస్తోంది. కొత్త క్లాసుకు వచ్చాడు చేతన్.అందరూ కొత్త టీచర్లు. క్లాసులోకి కొత్త మాథ్స్ టీచర్ వచ్చింది.పిల్లలందరి పేర్లు అడిగి తెలుసుకొంది.
గమ్మత్తయిన లెక్కలు చెప్తూ పిల్లల్ని నవ్విస్తోందీ టీచర్. కేరింతలు కొడుతూ, ఉత్సాహంగా వింటున్నారు పిల్లలు. పిల్లలకు ఈ కొత్త టీచర్ భలే నచ్చింది.టీచర్ పేరు కాళింది.

శౌరి వాళ్ళు ఉండే కాలనీ చాలా పెద్దది. ఆరు బిల్డింగులు ఉన్నాయక్కడ.చిన్నపిల్లలు ఆడుకోవడానికి గార్డెను, పెద్దవాళ్లు యోగ చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి సౌకర్యంగా చక్కటి స్థలంలో,చుట్టూ చెట్లతో ఆహ్లాదంగా ఉండే లగ్జరీ కాలనీల్లో అదొకటి.

ఆరోజు గార్డెన్ నుండి ఉల్లాసంగా వచ్చాడు చేతన్.

“అమ్మమ్మా! అమ్మమ్మా! మా మ్యాథ్స్ టీచర్ మన కాలనీలోనే కనిపించింది.”అంటూ ఉత్సాహంగా చెప్పాడు.

అక్కడ ఉన్న అరడజను బిల్డింగుల్లో ఎవరో ఒకరు రావటమో వెళ్లటమో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది.తండ్రి ఆఫీస్ నుండి వచ్చాక కూడా చేతన్ కాళింది టీచర్ గురించే చెప్తూ ఉన్నాడు.

నాలుగు రోజుల తర్వాత వాడితో పాటు కాళింది టీచర్ కూడా వాడి స్కూల్ బస్సు ఎక్కింది.నేరుగా వచ్చి చేతన్ పక్కనే కూర్చుంది.వాడికి చాలా గర్వంగా ఉంది. వెళ్ళినంత సేపు పిల్లలకు రిడిల్స్, జోక్స్ చెప్తూ నవ్విస్తూనే ఉంది టీచర్. పిల్లలకు కూడా సరదాగా ఉంది. ఇంకో నెల రోజులు గడిచాయి.

ఈమధ్య ఓ పదిరోజులు సుధాకరుకు ఒంట్లో బాగుండలేదు.మాటి మాటికీ ఆయాసం ఎక్కువ అవుతోంది. మామూలుగా చేతనుకు హోమ్ వర్క్ చేయించే బాధ్యత సుధాకర్ తీసుకునేవాడు. ఇప్పుడు మామగారికి ఒంట్లో బాగా లేకపోవడం వల్ల పిల్లవాడికి కాలనీలోనే ట్యూషన్ ఎవరైనా చెప్తారేమోనని వాకబు చేశాడు శౌరి. కాళింది టీచరు ట్యూషన్లు చెప్తుందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడి చేతనును ట్యూషనులో చేర్పించి వచ్చాడు.అభిరామ్ వచ్చి తండ్రిని తన ఇంటికి తీసికొని వెళ్ళాడు. కొడుకు, కోడలు దగ్గర కొన్ని రోజులు గడిపి తిరిగి శౌరి ఇంటికి వచ్చాడు సుధాకర్.

ఒకరోజు చేతనుతో పాటు గార్డెనుకు వెళ్ళింది హైమ. అక్కడ కాళింది టీచర్ కనిపించింది. చామనఛాయ.. ముప్ఫయ్యేళ్లు దాటుంటాయి. మొహంలో కాస్త ముదురుతనం కనిపిస్తోంది.కాసేపు కాళిందితో మాట్లాడింది హైమ.

మరో రెండు నెలలు గడిచాయి. ఈ మధ్య చేతనుకు కాళింది టీచర్ ప్రాణం అయిపోయింది. శని, ఆదివారాలు వాడిని తీసికొని లైబ్రరీకి వెళ్లి వస్తోంది కాళింది. వాడికి డిబేట్స్, పాటల పోగ్రామ్స్ అంటూ కొత్త చదువులు మొదలయ్యాయి. వాడి ప్రాధాన్యతలు, కాలక్షేపాలు మారిపోయాయి.

రాత్రిపూట వాడిని కూర్చోబెట్టుకొని శౌరి ఇంటర్నెటులో చూపించే విషయాల పట్ల ఆసక్తి పెరిగింది.

ఇంతలో శౌరి వాళ్ళ ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ ఖాళీ అయింది. దానిలోకి కాళింది టీచర్ వాళ్ళే వస్తున్నారనే వార్తను మోసుకొచ్చాడు చేతన్. వాళ్ళు ఇంట్లోకి వస్తుంటే ట్యూషన్ పిల్లలందరూ వచ్చి సగం సామాను సర్దేశారు. హైమ నాలుగుసార్లు చేతనును అన్నానికి పిల్చినా రాలేదు.
“నేను ఇక్కడ తినిపిస్తాలెండి!”అంది కాళింది.
చేసేదేమీ లేక ఊరుకొంది హైమ.

కాళింది ఇంట్లో సాయంత్రం ఏడింటి దాకా ట్యూషన్ పిల్లలు ఉంటారు. చేతన్ లాంటి చిన్నపిల్లలకు ఆరింటికే ట్యూషన్ అయిపోతుంది. కాస్త పెద్ద పిల్లలకు ఏడింటి దాకా ట్యూషన్ చెప్తుంది కాళింది. ట్యూషన్ అయ్యాక కాసేపు ఫ్రెండ్సుతో గార్డెనులో ఆడుకొని వస్తాడు చేతన్. ఆఫీసు నుండి వచ్చిన తండ్రితో కబుర్లు చెప్తూ అన్నం తిని పడుకుంటాడు.ఒక్కోసారి కాళిందితో పాటు సినిమా చూస్తూ అన్నం వాళ్ళింట్లోనే తింటున్నాడు. పైగా వాడికిష్టమైన కేకులు, పిజ్జాలు చేసి తీసుకొని వస్తూ ఉంటుంది కాళింది. దాంతో టీచర్ మాటంటే వేదంలాగా వింటున్నాడు చేతన్. వీకెండ్సులో వాడి ఈడు పిల్లలకు ఏవో ప్రోగ్రాములు ఉండనే ఉంటాయి.
ఇంతకు ముందులాగా వాడు’అమ్మమ్మా!అమ్మమ్మా!”అంటూ హైమ కొంగు పట్టుకొని తిరగటం లేదు.
వాడి ప్రవర్తనకు ఉక్కిరి బిక్కిరి అవుతోంది హైమ.

“వాడు ఎదుగుతున్నాడు హైమా!ఎప్పుడూ నిన్నూ నన్నూ పట్టుకొని తిరుగుతాడా చెప్పు!గుర్తు తెచ్చుకో!మన పిల్లలు ఎలా పెద్ద వాళ్లయ్యారో! ఇప్పటికైనా మనం మన ఇంటికి వెళదాం!ఆలోచించు హైమా!”అంటూ భార్యకు అనునయంగా చెప్పాడు సుధాకర్.వినలేదు హైమ.

ఆ రోజు ఆదివారం.
ప్రొద్దున్నే ప్రకాశం, శ్రీదేవి వచ్చారు.
వాళ్ళు వచ్చిన కాసేపటికే రామకృష్ణ దిగాడు.
ఆ సమయానికి చేతనును తీసికొని లైబ్రరీకి వెళ్ళింది కాళింది.
హాల్లో కూర్చున్నారందరూ.

‘మళ్ళీ వీళ్ళు శౌరి పెళ్లి గురించే మొదలుపెట్టటానికే వచ్చారు ‘అనుకొంది హైమ.హాల్లోకి వెళ్లకుండా వంటింట్లో ఏదో సర్దుతూ ఉంది.
వంటింటి గుమ్మం దాకా వచ్చాడు శౌరి.

“అత్తయ్యా!మీరు హాల్లోకి వస్తారా!నా పెళ్లి గురించి మీతో మాట్లాడాలి!”అన్నాడు శౌరి.

విషయం హైమ ఊహించిందే అయింది..

‘మళ్ళీశౌరికి పెళ్లి ప్రయత్నం!… చేసుకోనీ!తను ఏమాత్రం అడ్డు చెప్పదు..సవతితల్లిగా ఎవరొస్తారు? చేతనును వదులుకుంటాడా?అప్పుడు కూడా గెలుపు తనదే!జీవితాంతం తండ్రిని, సవత్తల్లిని ద్వేషిస్తూ చేతన్ తన దగ్గరే ఉంటాడు. అప్పుడు కొడుకు ప్రేమ దక్కని శౌరి జీవితాంతం క్షోభ పడుతూ ఉంటాడు.తన కూతురు స్థానంలో ఇంకొకరిని తెచ్చి పెట్టాలనుకుంటే ఆ మాత్రం శిక్ష అనుభవించాల్సిందే!’

వంటగది గుమ్మం దగ్గర నిలుచున్నాడు శౌరి.

“మీరు పెద్దవాళ్లవుతున్నారు. ఇంకా మీ చేత చేయించుకోవటం భావ్యం కాదు!… . మీ కంటే నా బిడ్డను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు.. పోయినసారి మీరు వెళ్ళాక నేను నా భవిష్యత్తు గురించి, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించాను. వెదకగా వెదకగా అన్నింటికీ సరిపోయిన సంబంధం ఒకటి వచ్చింది. ఆమె డైవర్సి. పెళ్లయ్యాక రెండేళ్లకు బిడ్డ పుట్టి పోయింది. ఆ కాన్పు కష్టం కావటం వలన ఆమెకు గర్భసంచి తీసేశారు. ఆమెకు అస్సలు పిల్లలు పుట్టరనేసరికి ఆమె భర్త, అత్తమామలు వేధించటంతో విధిలేక విడాకులు తీసుకొంది. ఐదేళ్ల తర్వాత ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆమె పేరెంట్స్…”
ఆగాడు శౌరి.
అల్లుడి మాటలు వింటోంది హైమ.
‘ఎవరు వచ్చినా ఏమవుతుంది? సవత్తల్లి ఇంట్లోకి రావటాన్నిచేతన్ ఇష్టపడడు!వాడి గురించి తనకు బాగా తెలుసు.’

ఆమె చెయ్యి పట్టుకొని తీసికొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు శౌరి.
అతడు క్రింద నేల మీద కూర్చున్నాడు.మృదువుగా ఆమె చేతులు పట్టుకొన్నాడు.

“మీ క్షోభ అర్థం చేసుకోగలను. నా రెండో భార్య నా బిడ్డకు సవత్తల్లి.ఆమెకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మా కిద్దరికీ వీడే బిడ్డ.వాడిని నా భార్య కాల్చుకు తింటుందని భయపడుతున్నారు కదా!నాకు ఆ భయం లేదు. బహుశా వాడికి కూడా ఉండదు… ఆమె..ఆమె.. కాళింది టీచర్.ఆమె పెళ్ళికి ముందు టీచరుగా పనిచేసేది. పెళ్లయ్యాక ఉద్యోగం మానేసింది. విడాకులు అయ్యాక మళ్ళీ ఉద్యోగం వెతుక్కొని చేసుకుంటోంది.సంబంధం చూసి, అన్ని విషయాలు మాట్లాడాక చేతనుతో అలవాటవుతుందని అందరం ప్రయత్నం చేసి వాడి స్కూల్లోనే టీచరుగా ఉద్యోగం వచ్చేట్లు చేశాము….”

నిర్ఘాంతపోయి వింటోంది హైమ.
‘కాళిందినా అల్లుడు పెళ్లి చేసుకునేది? సవతితల్లి కాళిందా!’

హైమకు మింగుడు పడటంలేదు.

ఎవ్వరూ పెదవి విప్పటం లేదు. అందరూ హైమనే చూస్తున్నారు. సుధాకర్ కూడా విభ్రాంతిగా వింటున్నాడు.

“చూడండి!కాళిందికి జీవితంలో పిల్లలు పుట్టరనే విషయాన్ని ఆమె భరించి రాజీపడి బ్రతుకుతోంది. మనం వినీలను పోగొట్టుకొన్నాము… మీరు.. నేను.. ఒక రకంగా రాజీపడి బ్రతుకుతున్నాము. ఇల్లంతా వినీల జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటోంది. అన్నీ తను వాడిన వస్తువులే..అన్నీ తనకు సంబంధించినవే.. కానీ నాకు ఈ ఒంటరితనం బాధనే కాదు భయాన్ని కలిగిస్తోంది.ఈ విషాద జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోంది. ఏదైనా కొత్తదనం కావాలనిపిస్తోంది. నాతో మాట్లాడే మనిషి, నాతో సాహచర్యం చేయగలిగే మనిషి కావాలని పిస్తోంది. నేను తోడు కోరుకోవటం పెద్ద తప్పు కాదనిపిస్తోంది…..కాళింది నన్ను అర్థం చేసుకుంటుందని నమ్మకం కలిగింది..”
శౌరి గొంతు గద్గదికమయింది.

హైమ అలాగే కూర్చుని ఉంది. అమె మనసులో తుఫాను రేగుతోంది. ఇలా అయ్యిందేమిటి?

ఇంకా ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొనే ఉన్నాడు శౌరి.
హైమ మనసులో బాధ, కోపం సుళ్ళు తిరుగుతున్నాయి.

‘పోయినసారి మనవడు తన కోసం బెంగ పెట్టుకున్నాడు. కానీ ఈసారి.. వాడు తనని కోరుకోడు. వాడు టీచర్ కావాలంటాడు. చిత్తుగా ఓడిపోయిన భావన!..

మెల్లగా అల్లుడి చేతుల్లోంచి తన చేతుల్ని తీసికొంది హైమ. వెనక్కు జారగిలపడి కూర్చుంది.

తేరుకున్నాడు సుధాకర్. లేచి వచ్చి భార్య ప్రక్కన కూర్చున్నాడు. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. మరో చెయ్యి అల్లుడి తల మీద చెయ్యి పెట్టి
“చాలా సంతోషం!మంచి నిర్ణయం.మీరు సంతోషంగా ఉండాలి! “అంటూ చెప్పి, కొంచెం గట్టిగా హైమ భుజం దగ్గర నొక్కాడు. భర్త సంకేతం అర్థం అయ్యింది హైమకు.మెల్లగా ముందుకు జరిగి తను కూడా అల్లుడి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లుగా అతడి తలను నిమిరింది.

అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హైమ సుధాకరుతో ఆ రోజే అభిరామ్ దగ్గరికి వెళ్దామంది.
తల్లిదండ్రులను తమ ఇంటికి తీసికొని వెళ్ళటానికి వచ్చాడు అభిరామ్.
నిర్వేదంగా ఆ ఇంటిని వదలి తన ఇంటికి వచ్చింది అల్లుడి చేతిలో ఓడిపోయిన హైమ.

ఆ రాత్రి చేతన్ తండ్రి పక్కన పడుకొని కబుర్లు చెబుతున్నాడు.
శౌరి కొడుకును దగ్గరికి తీసికొని
“మీ కాళింది టీచర్ని మన ఇంటికి తెచ్చుకుందామా!”
అని అడిగాడు.
అతడి గుండె వేగంగా కొట్టుకుంటోంది.

“మనింట్లోనా? ”

“అవును!టీచర్ని ఇంకో అమ్మలాగా…తెచ్చుకుందామా!.. ”

“ఎప్పటికీనా!”

“అవును!కానీ నువ్వు టీచర్ని సవత్తల్లి అనుకుంటావా?”

“టీచర్ సవత్తల్లి ఎందుకు అవుతుంది?…. టీచర్ విచ్ కాదు నాన్నా! చాలా మంచిది!కానీ మన ఇంట్లో ఉండటానికి టీచర్ ఒప్పుకుంటుందా?”

“రేపు అడుగుతాను!” కొడుకును తన గుండెల మీదకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు శౌరి.

తండ్రి గుండె మీద పడుకొన్నవాడల్లా లేచి
“నువ్వు కాదు నాన్నా!మన ఇంటికి టీచర్ వస్తుందో రాదో నేనే అడుగుతాను!”అంటూ ఫోన్ తీసికొని కాళిందికి రింగ్ చేశాడు చేతన్.

నవ్వుతూ కొడుకుని చూస్తున్నాడు శౌరి.

“టీచర్ ఎప్పటికీ మనింట్లోనే ఉంటుందట నాన్నా!”అంటూ మంచం మీద గిరికీలు కొడుతున్న కొడుకుని అమాంతం ఎత్తుకొని గరగిరా తిప్పి వాడి బుగ్గల మీద ముద్దులు కురిపించాడు శౌరి.

కిలకిలా నవ్వుతున్నాడు చేతన్.

— టి. వి. ఎల్. గాయత్రి, మహారాష్ట్ర.

(సమాప్తం)

*********************

Leave A Reply

Your email address will not be published.