స్మితా సభర్వాల్‌పై చర్యలకు పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు… కమిషన్ ప్రశ్నలకు సమాధానం దాటవేత…

స్మితా సభర్వాల్‌పై చర్యలకు
పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు…

కమిషన్ ప్రశ్నలకు సమాధానం దాటవేత…

ఐఏఎస్ పై చర్యలు తప్పవా.?

హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 2 :

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడిన మూడు కీలక బ్యారేజీల (అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ) వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్‌పై ఆరోపణలు ముదురుతున్నాయి. ఈ నిర్మాణాల్లో ఆమె పాత్ర ప్రధానమని, తన విధుల్లో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, ఆమెపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఇది సంగతి…

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలు, నిర్ణయాలకు సంబంధించిన అంశాలు క్యాబినెట్‌ ముందు పెట్టారా? లేదా.? అని పీసీ ఘోష్‌ కమిషన్‌ ఆమెను ప్రశ్నించగా మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో పనిచేసిన స్మితా సభర్వాల్‌ పరస్పర భిన్నమైన సమాధానాలిచ్చారు. కమిషన్ విచారణలో బ్యారేజీల ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు ఉంచారా? అని అడిగినప్పుడు, మొదట స్మితా సభర్వాల్ “అవును” అని సమాధానం ఇచ్చారు. జీవో 776లో ఆ ప్రస్తావనే లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయగా మాట మార్చి తనకేం తెలియదని బదులిచ్చినట్లు పీసీ ఘోష్‌ నివేదిక పేర్కొంది. ఈ వైఖరి ఆమె సమాధానాల్లో స్పష్టత లేనట్లు, ఆమె తప్పిదం ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. విచారణ సమయంలో స్మితా సభర్వాల్ ఈ నిర్మాణాల ప్రణాళిక లేదా నాణ్యత నియంత్రణలో తనకు సంబంధం లేదని వాదించారు.

సమాధానం ఇవ్వలేకనే…

అయితే ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆమె నీటిపారుదల శాఖకు పలు లేఖలు పంపిన రికార్డులు, అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఆధారాలు కమిషన్ ఎదుట ఉంచబడ్డాయి. దీంతో ఆమె వాదనలు తప్పుడు అని నిర్ధారించబడింది. కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని అడిగినప్పటికీ, చాలా సందర్భాల్లో ఆమె “తెలియదు” అని తప్పించుకున్నారని పేర్కొంది. ముఖ్య పదవిలో ఉన్నప్పటికీ తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదని, ప్రజా ప్రయోజనాలను విస్మరించిందని కమిషన్ కఠినంగా విమర్శించింది. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, స్మితా సభర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సు చేసింది.

Leave A Reply

Your email address will not be published.