ఆసుపత్రుల పనితీరును మరింతగా మెరుగుపర్చాలి : జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఆసుపత్రుల పనితీరును మరింతగా మెరుగుపర్చాలి

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ కలెక్టరేట్, వార్తటుడే, ఆగస్టు 14 :

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో కొనసాతున్న జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్ష జరిపారు. బోధన్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రితో పాటు ఆర్మూర్, భీంగల్, ధర్పల్లి ఏరియా ఆసుపత్రులు, డిచ్పల్లి, వర్ని, మోర్తాడ్, కమ్మర్పల్లి, నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, వాటి భర్తీకి చేపట్టిన చర్యల గురించి జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలను పరిశీలించారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆయా ఆసుపత్రులలో కొనసాగుతున్న సివిల్ సర్జన్ లు, డిప్యూటీ సివిల్ సర్జన్ లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల గురించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఇన్ పేషంట్, అవుట్ పేషంట్ సేవలు, శస్త్ర చికిత్సలు, డయాలసిస్ తదితర విభాగాల పనితీరును సమీక్షించారు. రెగ్యులర్ పోస్టుల నియామకం జరిగేంత వరకు తాత్కాలికంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యుల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు. కాగా, వర్ని, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రుల భవన నిర్మాణాల పనులు వేగంగా , నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, ఆయా ఆసుపత్రుల వైద్యాధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment