సెలవు అంటున్న ఉత్తరాల ఎర్ర డబ్బా
సెప్టెంబర్ 1 నుంచి కనిపించని పోస్టు బాక్స్..
పోస్టల్ శాఖ నిర్ణయం
హైదరాబాద్, వార్తటుడే, ఆగస్టు 17 :
సెప్టెంబర్ 1 నుంచి లెటర్స్ రెడ్ బాక్స్ కనుమరుగు కానుంది. సెలవు.. ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్ర డబ్బా. దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదు. మన ముత్తాతలు, తాతలు, నాన్నల కాలం నాటినుంచి మన ఇళ్లకు దగ్గరలోనో, వీధి చివర్ల లోనో, పోస్ట్ ఆఫీస్ దగ్గర అభిమానంతో ఎదురు చూసిన నెచ్చెలి. ప్రేమలు ఆత్మీయత తో కూడిన వార్తలు మోసుకొస్తూ, తీసుకు వెళ్తూ సంధాన కర్తగా, సేవలు అందించిన స్నేహశీలి పోస్టు బాక్స్. ఆశల కబుర్లు మోసుకు వచ్చి మనస్సుల్లో సంతోషాల పంచిన మిత్రుడు నేను ఇక కనిపించను అంటే ఎలా ఉంటుందో ఊహించటం కష్టం.
లెక్క లేనన్ని జ్ఞాపకాలు…
సుదూర తీరాలలో ఉన్న బంధువులు, మిత్రులకు మన ఇంటిల్లిపాది విషయాలను మోసుకు వెళ్ళింది. అలాగే తీసుకు వచ్చింది. శుభ వార్తలు, పెళ్లి శుభా లేఖలు, పరీక్షా ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం వచ్చిందనే తియ్యని కబురు ఇలా ఎన్నో మోసిన సమ్మోహన పావురం ఎర్ర డబ్బా. జీవనం కు లింకు లంకె కదా…ప్రేమికులకు హృదయ స్పందన… సరిహద్దు సైనికులకు తమ వారి నుంచి వచ్చే ఒక శ్వాస అయింది కదా. అప్పుడప్పుడు కన్నీటి వార్తలను కూడా దిగమింగి చేర్చింది. ఒక్కసారి చేతి ముని వేళ్ళతో తనలో జార విడిచిన తరువాత , తిరుగు సమాధానం వచ్చే వరకు వేచి చూడని వారు ఉండరు కదా*
*బాబూ వీధి మూలన ఉన్న డబ్బాలో ఈ ఉత్తరం కాస్త వేసి రామ్మా ..అల్లుడు దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా…అబ్బాయి ఏమన్నా ఉత్తరం రాశాడా..ఈ మాటలు పాత సినిమాల్లో నే వినిపిస్తాయి.కనిపిస్తాయి. అంతే కదా.
మాయం వెనుక జ్ఞాపకం…
కాలం మారి కార్డు, ఇన్లాండ్ లెటర్ ,కవర్ అయింది. అ తరువాత అన్నీ మాయం. ఇవి లేక పోతే ఇక అవి వేసే ఎర్ర డబ్బా అవసరం పోయింది. అంతే ఇప్పుడు ఈ డబ్బా మాయం కానుంది. మనము మరచి పోవటం కష్టమే. ఎందుకంటే ఇది మన హృదయ స్పందన గా ఉండేది. లోహపు పెట్టే కానీ మనిషి తనం నింపుకున్నది. పైగా అందరి కష్టసుఖాలు, సంతోషాలు , అభిప్రాయాలు అత్యంత గోప్యంగా మోసిన పెట్టె . మామూలిది కాదు.. కవుల కలాల్లో , సినిమాల్లో , సాహిత్యం లో భాగమైంది కదా. ఇక అన్నీ పోస్ట్ చేయని ఉత్తరాలే . జీవన ప్రయాణం లో భాగమైన పెట్టే కదా…ఎలా మరచి పోగలం..సాధ్యమా.. సెప్టెంబర్ ఒకటి నుంచి కంటికి కనిపించక పోవచ్చు కానీ మన తరం జీవించి నంతా కాలం మన హృదయాల్లో మాత్రం పదిలం.
*ఏ సృజన శీలి సృష్టించా రో తెలియదు కానీ…చుక్క నీరు లోపలికి పోదు. గాలివాన కదపలేదు. కుంభవృష్టి అయినా, జోరు వర్షం అయినా , ముసురు పట్టినా, కొద్దిచెమ్మ కూడా తగల నివ్వదు. తల్లి సంక న చంటిపిల్లలు ను పెట్టుకుని కాపాడినట్లు చూస్తుంది. గాలికి బెదరదు.ఎగరదు. దానిలో కార్డు, ఇన్లాండ్ లెటర్, కవర్ వేయటం ఒక సరదా. వాటిని తీస్తున్నప్పుడు చూడటం అదో సరదా.
#postoffice #postalservice