ఆకలిరంగుపై కలాల రంగు…
కవితల పోటిల్లో 20 మంది ఎంపిక…
ఎంపికైన వారికి ప్రశంస పత్రాల పంపిణి…
(వార్తటుడే – సాంస్కృతికం)
విశ్వ సాహితీ కళావేదిక ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కవితల పోటీలో *ఆకలిరంగు* అనే అంశంపై 306 మంది కవులు పాల్గొన్నారు. వారి కలాలను అంశానికి తగినట్లుగా
“ఆకలి రంగు” అనే అంశంతో నిర్వహించిన కవితా పోటీకి అందరి నుంచి వచ్చిన అద్భుతమైన సృజనాత్మకంగా ఆకలి అనే మానవావస్థను రంగుల ద్వారా ఆవిష్కరించి, సామాజిక సమస్యలను, మానసిక గాయాలను, కవిత్వంతో చిత్రించిన రచనలకు కళా వేదిక ఛైర్మెన్ కె రమావతి బృందం ఎంపిక చేసారు. ఈ సందర్భంగా రమావతి ఎంపిక అయిన వారికి అభినందనలు తెలిపారు.
ఈ ఎంపికలు కవితలోని భాషా సౌందర్యం, భావ లోతు, అంశ సంబంధం, సృజనాత్మకత ఆధారంగా జరిగాయి.
పాల్గొన్న కవులు అందరూ కూడా పోటాపోటీగా ఉన్నతమైన రీతిలో అద్భుతమైన కవనాలను అందించారు.
వీటి నుంచి టాప్ 20 కవితలను ఎంపిక చేయడం
జరిగిందని తెలిపారు. ఎంపిక అయిన వారికి ప్రశంస పత్రాలను అందజేస్తామని అన్నారు.
అగోచర అగ్ని…
***************
ఆకలి రంగు ఎరుపు కాదు నిశ్శబ్దంగా
మరణం వైపు నెమ్మదిగా తోసే శక్తి.!
ఆకలి లోలోపల మండే అగ్నిజ్వాల,
అది శబ్దం చేయదు
నిశ్శబ్దంగా ప్రాణాలను కొరుక్కుంటుంది.
చిన్నారుల బుగ్గలపై
ఎండిన కన్నీటి చారికలుగా
ప్రతిరూపం దాల్చుతుంది.
వేడుకలలో వృధా అయ్యే వంటకాల
వాసన బస్తీ వీధులను ముంచెత్తుతుంది
కానీ అది కడుపు నింపదు
ఆకలి బాధను మరింత రెచ్చగొడుతుంది!
ఒక వైపు అన్నం చెత్త కుప్పల పాలవుతుంటే
మరో వైపు ఆకలి కేకలు
రాత్రి చీకటిని చీల్చుతాయి!
ఇదే మన ఆర్థిక నాగరికత
ఇదే అసమానతల చిత్రపటం
ఒక చోట మోతాదుకు మించి విందు
మరో మూల చావుకు మించి ఆకలి!
కార్పొరేట్ భవనాల ఎత్తు పెరిగేకొద్దీ
పేదవాడి పొట్టలో గాలి మాత్రమే పెరుగుతుంది!
గాజు గోడల లోపల జీవించే వారికి
ఆకలి శబ్దం చేరదు!
చెమట చిందించి పండించిన పంట
ధరల పతనంలో విలువ కోల్పోతే
రైతు అనుభవించే కన్నీటి రోదనే
ఆకలి రంగు!
ఆ రంగును చెరిపేయాలి
ప్రభుత్వ నిర్లక్ష్యం విడవాలి
ఆకలితో అల్లాడే సమాజం
ఎప్పుడూ అభివృద్ధి సాధించదు!
మారాలి సమాజం నడిచే విధానం,
మారాలి మనుషుల దృక్కోణం అప్పుడే
సమసమాజం రూపుదిద్దుకుంటుంది,
ఆకలి లేని లోకం ఆవిర్భవిస్తుంది.!
— డాక్టర్ మామిడాల శైలజ, హనుమకొండ.
@@@@@@@@@@@@@
ఆకలి కేకలు
****************
అర్ధరాత్రి నల్లని చిమ్మ
చీకటిలోనూ నిద్దుర కంటిని చేరలేదు
బలవంతాన కన్నులుమూసుకున్నా ఫలితం
లేదు
మెలికలు తిరుగుతున్నాయి కాళ్ళూ, చేతులూ
మూలుగు పెడుతున్నాయి తిండి లేక ఎండిన డొక్కలు
నేడు డిచిన పగలు రేపటి పగటిని గుర్తు చేసి బాధపెడుతుంది.
ఉదయించే ఎర్రని సూర్యుని వెలుతురుని గుర్తుచేసి భయపెడుతుఃది
కారణం
తెల్లని అన్నం ముద్ద కంటపడి చాలా కాలమే అయ్యింది
అది కడుపున పడి చాలా దినములే గడిచింది
ఆకలి సెగలు కక్కుతున్న పగటికి భయపడి
రేతిరి గుండెలకత్తుకుపోయి నిదరోదామంటే
ఖాళీ కడుపు గోలెడుతుంది
కన్నుల వెంట నీరెళుతుంది
పచ్చగ లేని నా బ్రతుకున ఆకలి కేకలు
నీలపు ఆకాశాన్నంటుతున్నా
సాటి మనిషికి వినబడకుంది
నా నోటికి కూసింత అన్నం ముద్ద అందించకుంది.
నా ఆకలి రంగు నిశీధి చీకటిలో నల్లని నలుపే అయ్యింది
నరుడన్న వాడి కంటికి కనీసంఎ కానరాకుంది.
— అన్నందాసు శ్రీదేవి, రాజమండ్రి.
@@@@@@@@@@
ఆరని జ్వాల
**************
ఎటు చూసినా అన్నమో రామచంద్రా
అంటూ ఆకలికేకల ఆర్తనాదాలే
ఈసురోమని మనుషులుంటే దేశమేగతి
బాగు పడునోయ్ అన్నట్లుగా సమాజం
మనిషి తిండి లేక డొక్క లెండిపోయే
పేదల కడుపుల్లో రగిలే జ్వాల
అనాధల ఆకలి మంటల గాధ
ఆకలి సర్వత్రా నిండిన కన్నీటి చారలు
వికలాంగులకు నిత్య మెదురయ్యే
సమస్యల తోరణాల వెతలు
రెక్కాడితే గాని డొక్కాడని జీవులకు
ప్రతి రోజూ ఆకలితో పోరాటమే,ఆరాటమే
పని చేయాలంటే శక్తి కావాలిగా
తిండి తింటేనే దేహానికి బలం సమకూరి
రెక్కల కష్టానికి దారి చూపు రాజీ పడు
ఆకలితో బాధపడే వారికి కడుపునిండా
అన్నం పెడితే వారి ఆకలి జ్వల అంతరించి
వారి మోముల పుష్పాలు వికసించి
ఆనంద భాష్ప జలాలతో కండ్ల తడి
మనసుకు సంతృప్తి ఫలాలు అందినట్లే
అన్నిదానాల కన్న అన్నదానమే శ్రేష్ఠమై
భాసించు
మానవసేవయే మాధవ సేవగా రాణించు
మహోన్నత మానవత్వ సిరులను దాల్చి
ఆకలి రంగును రూపుమాపి సమసమాజ
స్థాపనకు అడుగులేద్దాం.
—తోట సులోచన, నెల్లూరు..
@@@@@@@@@@@@@
అవ్యయీ భావం
***************
ఉదరంలో రంపపు కోతలా ఉండేది
ప్రేవుల్లో పుండు ని తడి గుడ్డలాఎవరో పిండుతున్నట్టుండేది
మాగిన గాయాన్ని వేళ్ళతో
కెలుకుతున్నట్టుండేది
కడుపులో పురుగు తొలుస్తున్నట్టుండేది
జఠరం అగ్నిలా మండుతున్నట్టుండేది
ఆకలి మంట ఎక్కువై మొద్దు బారినట్టుండేది
తిరిగి సెలేసి తీరకపోతే మైగ్రేన్ తలనొప్పిగా మారేది
కళ్ళను బైర్లు కమ్మించేది
శరీరాన్ని నీరసంతో వణికించేది
కూర్చోనిక పడవేసేది
కదలనీక పడుకోబెట్టేది
నిద్ర పట్టనీక కొట్టుకులాడించేది
కన్నీళ్ళై ఆక్రోశమై అరవాలనిపించేది
శక్తి లేక కీచుమని అణగారి పోయేది
పేదవాడి చెమట నీటిలో కనిపించేది
అనాథ శిశువు ఎండు డొక్కలలో నివసించేది
బాటసారి పాదాల రక్తపు చిప్పిళ్ళలో కనిపించేది
విధి వంచిత నిట్టూర్పులలో నినదించేది
నిరుద్యోగి మూడో నేత్రాన్ని రగిలించేది
తిరుగుబాటుదారుల పిడికిళ్లలో బిగిసేది
మృత్యుముఖంలో ని ప్రేత కళలో
ప్రస్ఫుటమయ్యేది…. అదే ఆకలిరంగు
లింగ వచన విభక్తులు విలువలు ఏమీ లేనిది.
—-కొలకానూరి దేవికరాణి, తెనాలి..
@@@@@@@@@@@@@@
అన్నార్తులు
**********
పగలనక రేయనక చెమటోడ్చి కష్టించు రైతన్నకు
ప్రపంచానికి భుక్తి నొసగేటి అన్నదాతకు
తినడానికి తిండికి కరువాయె
ఆకలితో అలమటించె
ఉరికొయ్యనె దిక్కని తలచె
ఆకలిరంగు అతని బ్రతుకును నల్లని చీకటిగ మార్చె
విధివంచితులై, బాల్యమె శాపమై
ఎందరో ఆభాగ్యులు ఆకలికి నేస్తాలై
విసిరేసిన విస్తరి మెతుకులకై పోరాటం సాగించిరి
ఆకలి రంగు వారిని ఉదరాగ్ని మంటలతో ఎర్రగా కాల్చేసె
అన్నమో రామచంద్రాయని అలమటిస్తూ
రోడ్లపై భిక్షమెత్తుకునే అన్నార్తులెందరో
పాచిపోయిన అన్నంకై పాకులాడే దీన జనులు
ఆకలి రంగు వారి బ్రతుకుల్లో పచ్చని కామెర్లు, పరిపరి రోగాలనే నింపె, ప్రాణాలను పరిహరించె
కన్నబిడ్డలే వృద్ధుల భారమని గెంటేయగ
కని కరుణలేనివారు పురిటిబిడ్డల చెత్త కుప్పల పాల్జేయగ
దైవం కన్నవారిని దూరము చేయగ
రెక్కలు లేని పక్షులై,తాడులేని బొంగరాలై,
దారం తెగిన గాలిపటాలై ,
ఆదరించువారులేక,
ఒక్క పూట అన్నానికి నోచుకోక
ఆకలి రంగు పులుముకునె, క్షుథ్బాధకు బలియైరి.
— మారంరెడ్డి నాగేశ్వరమ్మ,
నంద్యాల.
@@@@@@@@@@@@@@